గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 07, 2021 , 20:16:46

ఏజీఆర్‌పై మళ్లీ సుప్రీంకోర్టుకు వొడాఫోన్‌

ఏజీఆర్‌పై మళ్లీ సుప్రీంకోర్టుకు వొడాఫోన్‌

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాత టెలీకం మేజర్ వొడాఫోన్‌ ఐడియా మరోదఫా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఏజీఆర్‌ బకాయిలను తిరిగి గణించాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. అదనంగా రూ.24వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు నిర్ణయించారని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ప్రస్తుతం తమ సంస్థ ఏజీఆర్‌ బకాయిలు రూ.58,254 కోట్లుగా గణించగా, ఇప్పటికే రూ.7,854 కోట్ల బకాయిలు చెల్లించామని వెల్లడించింది.

కేవలం లైసెన్స్‌ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తమ ఏజీఆర్‌ బకాయిలు కేవలం రూ.28,308 కోట్లు మాత్రమేనని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. తమ రెవెన్యూను లెక్కించడంలో పొరపాట్లు జరిగాయని వెల్లడించింది. అయితే తమ ఏజీఆర్‌ బకాయిలను టెలికం శాఖ గణించడంలో లోపాలున్నాయని, దీనిపై వొడాఫోన్‌ ఐడియా క్లారిఫికేషన్‌ కోరిందని ఆ సంస్థ వర్గాల కథనం. 

గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ప్రభుత్వానికి రూ.50,400 కోట్ల ఏజీఆర్‌ బకాయిలను 2031 మార్చి నెలాఖరు నాటికి పది సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వొడాఫోన్‌ ఐడియా తమ ఏజీఆర్‌ బకాయి రూ.21,533 కోట్లేనని తన స్వీయ అంచనాలో పేర్కొంది. కానీ ఏజీఆర్ బకాయిలపై టెల్కోల సొంత అంచనాలను ఇంతకుముందు సుప్రీంకోర్టు నిషేధించింది. టెలికంశాఖ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

ఇంతకుముందు భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ ఏజీఆర్‌ బకాయిలను తిరిగి లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మొత్తం ఏజీఆర్‌ బకాయిలు రూ.44 వేల కోట్లు కాగా, ఇప్పటికే ఎయిర్‌ టెల్‌ రూ.18 వేల కోట్లు చెల్లించింది. తమ స్వీయ అంచనా ప్రకారం ఏజీఆర్‌ బకాయిలు రూ.13,004 కోట్లు మాత్రమేనని ఎయిర్‌ టెల్‌ వాదిస్తున్నది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo