కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh)పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. ‘కునాల్ ఘోష్ ఇటీవల పార్టీకి పొంతన లేని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి ఆపాదించకూడదని స్పష్టం చేస్తున్నాం. ఏఐటీసీ ప్రధాన కార్యాలయం జారీ చేసిన ప్రకటనలను మాత్రమే అధికారికంగా పరిగణించాలి’ అని అందులో పేర్కొంది. అలాగే గతంలో పార్టీ అధికార ప్రతినిధి పాత్ర నుంచి కునాల్ ఘోష్‌ను తప్పించగా తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు వెల్లడించింది.
కాగా, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన తపస్ రాయ్‌పై కునాల్ ఘోష్ ప్రశంసలు కురిపించారు. బుధవారం కోల్‌కతాలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయనతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కునాల్ ఘోష్, తమకు ఇష్టమైన వ్యక్తి తపస్ రాయ్ అని తెలిపారు. ఆయన తలుపులు ఎల్లప్పుడూ ప్రజల కోసం తెరిచి ఉంటాయని, అందరి కోసం ఆయన పని చేస్తారని కొనియాడారు. తామిద్దరం వేరు వేరు పార్టీల్లో ఉండటం బాధగా ఉందన్నారు. ‘మేము మా అభ్యర్థి (టీఎంసీ) కోసం పని చేస్తాం. ఆయన పార్టీ కార్యకర్తలు ఆయన కోసం పని చేస్తారు’ అని అన్నారు. ఈ నేపథ్యంలో కునాల్ ఘోష్‌పై టీఎంసీ చర్యలు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించింది.