న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యాంకింగ్ రంగ విస్తరణపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ చర్చిస్తున్నట్టు చెప్తున్నారు. ఇందులోభాగంగానే 2014 తర్వాత మరోసారి నూతన బ్యాంకుల కోసం ఆర్బీఐ లైసెన్సులు ఇచ్చే వీలుందని ఓ కథనంలో బ్లూంబర్గ్ పేర్కొన్నది. అయితే అటు ఆర్థిక శాఖ నుంచిగానీ, ఇటు ఆర్బీఐ నుంచిగానీ దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు. కానీ ఈ వార్తల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో మాత్రం కనిపించింది. నష్టాల నుంచి బ్యాంకింగ్ షేర్లు కాస్త కోలుకోగలిగాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు జీడీపీలో బ్యాంక్ ఫండింగ్ దాదాపు 130 శాతానికి పెరగాల్సిన అవసరం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇది 56 శాతంగానే ఉన్నది. అందుకే బ్యాంకింగ్ సేవల విస్తరణ అనివార్యంగా కేంద్రం, ఆర్బీఐలకు తోస్తున్నది.
బ్యాంకుల ఏర్పాటుకు ముందుకు వచ్చే బడా సంస్థలకు షేర్హోల్డింగ్పై ఆంక్షలతో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు అనుమతించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాగే ఇప్పుడున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను పూర్తిస్థాయి బ్యాంకులుగా సేవలందించేలా ప్రోత్సహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ మదుపరుల వాటాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టూ తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వాటా 20 శాతానికి మించరాదు. ఈ స్థాయికి పెరగాలన్నా ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. నిజానికి బ్యాంకింగ్ లైసెన్సులకు దరఖాస్తు పెట్టుకోవడానికి వీల్లేకుండా భారీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలపై 2016లోనే మోదీ సర్కారు నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే ఆంక్షలతో కూడిన అనుమతులు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకింగ్ ప్రయోజనాల దుర్వినియోగం, దివాలా వంటి ప్రమాదాలు పొంచి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
చిన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. దీంతో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో కలిసిపోయాయి. మరోవైపు దక్షిణాది రాష్ర్టాల్లోగల కొన్ని ఎన్బీఎఫ్సీలను పూర్తిస్థాయి బ్యాంకింగ్ సర్వీసుల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలని కేంద్రం చూస్తున్నది. బ్లూంబర్గ్ వివరాల ప్రకారం భారత్ తరఫున ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీలు మాత్రమే ఆస్తులపరంగా ప్రపంచంలోని టాప్-100 బ్యాంకుల్లో ఉన్నాయి.