Stock Markets | ముంబై, నవంబర్ 21: సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్‌పై వచ్చిన దాదాపు రూ.2,240 కోట్ల (265 మిలియన్ డాలర్లు) లంచం ఆరోపణలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి. దీంతో అదానీ సంస్థల షేర్లన్నీ భీకర నష్టాలకు లోనయ్యాయి. ఫలితంగా ఈ ఒక్కరోజే రూ.2.20 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇది గత ఏడాది హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా గ్రూప్ సంస్థలకు వచ్చిన నష్టాల కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం.
ఏడాది కనిష్ఠానికి..ఈ కేసులో అమెరికాలో గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో మదుపరులు ఆయనకు చెందిన కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. దీంతో ఆయా కంపెనీల షేర్ల విలువ వేగంగా పడిపోయింది. ఇలా మొత్తం 10 సంస్థల మార్కెట్ విలువ రూ.2,19,878.35 కోట్లు కరిగిపోయింది. ఈ క్రమంలో గడిచిన కొన్ని వారాలుగా భారీగా పుంజుకున్న అదానీ గ్రూప్ షేర్లకు గురువారం పెద్ద దెబ్బే తగ్గిలినైట్టెంది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ అత్యధికంగా 22 శాతానికిపైగా నష్టపోయింది.
క్రెడిట్ రేటింగ్‌కు దెబ్బ
లంచాలకు సంబంధించి గౌతమ్ అదానీపై వచ్చిన నేరారోపణలు అదానీ గ్రూప్ క్రెడిట్ రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇకపై అదానీ గ్రూప్ నిధుల సమీకరణకు వెళ్తే.. దాని సంస్థల ఆర్థిక స్థితిగతులను మదించేటప్పుడు ఆయా కంపెనీల్లోని పాలనాపరమైన అంశాలనూ తప్పకుండా లోతుగా పరిశీలిస్తామని గురువారం మూడీస్ స్పష్టం చేసింది. ‘ముడుపులపై అదానీ గ్రూప్ చైర్మన్, ఇతర సీనియర్ అధికారులపై వచ్చిన నేరారోపణలు.. ఆ గ్రూప్ కంపెనీల రుణ పరపతిని దిగజారుస్తాయి’ అని మూడీస్ రేటింగ్స్ పేర్కొన్నది.
ఎల్ఐసీకి రూ.8,567 కోట్ల నష్టం
దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అదానీ గ్రూప్ సంస్థల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీకి.. తాజా పరిణామాలతో ఏకంగా రూ.8,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది మరి. ఏసీసీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 1.36 శాతం నుంచి 7.86 శాతం వరకు ఎల్ఐసీకి వాటాలున్నాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ ముగిసే నాటికి రూ.54,861 కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఎల్ఐసీ పెట్టుబడులు.. గురువారం మార్కెట్ ముగిసే నాటికి రూ.46,294 కోట్లకు పరిమితమయ్యాయి.
ఒత్తిడిలో ఫండ్స్
అదానీ గ్రూప్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు రూ.43వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన 10 అదానీ గ్రూప్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి చెందిన ఆస్తులు గత నెల అక్టోబర్ 31 నాటికి రూ.43,456 కోట్లుగా ఉన్నాయి. ఎన్డీటీవీ మినహా మిగతా అన్ని అదానీ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. దీంతో ప్రస్తుతం ఈ పెట్టుబడులన్నీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
తప్పించుకోలేడు..
గౌతమ్ అదానీ, మరికొందరిపై వచ్చిన నేరారోపణలు తీవ్రమైనవేనని, వీటివల్ల అదానీ గ్రూప్‌నకు ఆర్థికంగా, పరపతిపరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్కు అవకాశాలున్నా.. అమెరికా కోర్టులోనే అదానీ గ్రూప్ పోరాడాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది హిండెన్‌బర్గ్ కేసులో భారతీయ కోర్టుల నుంచి వచ్చిన ఉపశమనం మాదిరే అమెరికా కోర్టుల నుంచీ వస్తుందనుకోవద్దని, అక్కడి చట్టాలు చాలాచాలా కఠినంగా ఉంటాయని పేర్కొంటున్నారు. లంచాల ఆరోపణల నుంచి తప్పించుకున్నా.. క్రిమినల్ ఆరోపణల నుంచి బయటపడటం అంత ఈజీ కాదని తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే ఈ కేసులో అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలు, సహాయం తీసుకుంటామని, ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.