Adani Group | న్యూయార్క్, ఫిబ్రవరి 23: భారత్ ముంగిట్లో ‘ఎన్రాన్’ తరహా ముప్పు పొంచిఉందని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమ్మర్స్ హెచ్చరించారు. ప్రస్తుత అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ఆయన 2001లో అమెరికా ఇంధన సంస్థ ఎన్రాన్ అకౌంటింగ్ కుంభకోణంతో అన్యాపదేశంగా పోల్చారు. బ్లూంబర్గ్ వాల్‌స్ట్రీట్ వీక్ కార్యక్రమంలో సమ్మర్స్ మాట్లాడుతూ ఇండియాలో ఎన్రాన్ మాదిరి ఉదంతం చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. అదానీ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలకు పాల్పడిందంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడం, వాటిని అదానీ గ్రూప్ ఖండించడమూ తెలిసిందే.
‘ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తున్నదని నేను భావిస్తున్నా, జీ20 సదస్సు భారత్‌లో జరుగుతున్నది. దీంతో ప్రస్తుతం ఈ దేశం పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది. ఇటువంటి ఆసక్తి కారణంగా భారత్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసే భారీ అంశాలపైనా దృష్టి పడుతుంది’ అని సమ్మర్స్ చెప్పుకొచ్చారు. తొలి జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్‌ల గవర్నర్ల సమావేశాలు శుక్రవారం బెంగళూరులో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్స్ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ అదానీ సంక్షోభంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో సహా పలు దేశాల్లో విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన ఎన్రాన్ కార్పొరేషన్ ఎనర్జీ ట్రేడింగ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు తదితరాల్లోకి వేగంగా విస్తరించి టెక్నాలజీ బూమ్కాలంలో వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు డార్లింగ్ షేరుగా మారింది. ఖాతా పుస్తకాల్లో ఆదాయాన్ని ఎక్కువచేసి చూపిస్తూ ఆకట్టుకున్న ఎన్రాన్ అకౌంటింగ్ స్కామ్ ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఎన్రాన్ షేర్ 90.75 డాలర్ల గరిష్ఠస్థాయి నుంచి కొద్ది నెలల్లో 0.26 డాలర్లకు పతనమయ్యింది. 2001, డిసెంబర్ 2న ఎన్రాన్ దివాళా ప్రకటించడంతో రుణాలిచ్చిన బ్యాంక్‌లు, బాండ్లు, షేర్లలో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లు పూర్తిగా నష్టపోయారు.
ఎన్రాన్ ఆర్థిక నేరాలు రుజువుకావడంతో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు కెన్నత్ లేతో సహా సీఈవో, సీఈవో, పలువురు అధికారులు జైలు పాలయ్యారు. అమెరికా కోర్టుల్లో విచారణ అనంతరం కెన్నత్ లేకు శిక్ష ఖరారయ్యే ముందు, గుండెపోటుతో మృతి చెందగా, సీఈవో స్కిల్లింగ్‌కు 2006లో 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మన దేశంలో మహారాష్ట్రలో 2.9 బిలియన్ డాలర్ల వ్యయంతో దభోల్ విద్యుత్ ప్లాంట్‌ను ఎన్రాన్ ఏర్పాటుచేసింది. ఎన్రాన్ దివాళా అనంతరం ఉత్పత్తిని నిలిపివేయగా, ఆ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసి రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ లిమిటెడ్ పేరుతో పునర్ప్రారంభించింది.
కొనసాగిన పతనం
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం గురువారం సైతం కొనసాగింది. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల్లో 8 నష్టాల్లో ముగిశాయి. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై చివరకు 1.5 శాతం నష్టంతో 1,358 వద్ద ముగిసింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడైన తర్వాత ఈ షేరు ఇప్పటికే 70 శాతం వరకూ పతనమయ్యింది. తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్లు ఎక్సేంజీలు అనుమతించిన 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. అదానీ విల్మార్ 3.5 శాతం పడిపోయింది. కొద్ది నెలల క్రితం అదానీ గ్రూప్ టేకోవర్ చేసిన ఏసీసీ, ఎన్డీటీవీలు 1 శాతం మేర క్షీణించగా, అంబూజా సిమెంట్ అరశాతం లాభంతో ముగిసింది. గ్రూప్‌కు నగదు నిల్వల్ని సమకూరుస్తున్న అదానీ పోర్ట్స్ 1 శాతం లాభపడి రూ.553 వద్ద నిలిచింది.