Adani Group | అమెరికా కోర్టులో తమపై దాఖలైన అభియోగాలను గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. సౌర విద్యుత్ దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు ముడుపులు ఇవ్వడానికి ప్రయత్నించారని అదానీ గ్రూపుపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అయితే, తమ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలు నిరాధారం అని అదానీ గ్రూపు పేర్కొంది. భారత చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటున్నదని వెల్లడించింది. యూఎస్ ప్రాసిక్యూటర్ల అభియోగాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది.
సౌర విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకోవడం కోసం భారత్ అధికారులకు సుమారురూ.2,200 కోట్ల ముడుపులు ఇవ్వజూపిందన్న ఆరోపణలు వచ్చాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అభియోగాలు రికార్డయ్యాయి. గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. దీనిపై రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
తమ గ్రూపుపై అవి కేవలం నేరారోపణలు మాత్రమేనని అదానీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. దోషులుగా రుజువయ్యే వరకూ నిందితులను నిర్దోషులుగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. పాలనా వ్యవహారాలతోపాటు, పారదర్శకత విషయంలోనూ అదానీ గ్రూప్ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నదన్నారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోటా వీటిని పాటిస్తున్నామన్నారు. చట్టాలను గౌరవిస్తున్నందున యూఎస్ కోర్టులో వచ్చిన నేరారోపణల విషయమై వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని అదానీ గ్రూప్ తెలిపింది.