Union Ministers- Wealth | కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరింది. ప్రధాని మోదీ సహా 71 మంది మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 70 మంది లేదా 99 శాతం మంది కుబేరులే. కేంద్ర మంత్రుల ఆస్తులు సగటున రూ.107.94 కోట్లు అని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ.100 కోట్ల పై మాటేనని వెల్లడించింది.
వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు రూ.5,705.47 కోట్లు. అందులో రూ.5598.65 చర, రూ.106.82 కోట్లు స్థిరాస్తులు.
కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మొత్తం ఆస్తులు రూ.424.74 కోట్లు. అందులో ఆయన స్థిరాస్తుల విలువ రూ.362.17 కోట్లు కాగా, చరాస్తులు రూ.62.57 కోట్లు.
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆస్తులు రూ.217.23 కోట్లు (రూ.115 కోట్లు స్థిరాస్తులు, రూ.102.24 కోట్లు చరాస్తులు). వాటిలో రూ.102.24 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి.
కేంద్ర సమాచార, ప్రసారాలు, రైల్వేశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆస్తులు రూ.144.12 కోట్లు. వాటిలో చిరాస్తులు రూ.1.72 కోట్లయితే చరాస్తులు రూ.142.40 కోట్లు.
కేంద్ర మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ (స్వతంత్ర హోదా) ఆస్తులు రూ.121.54 కోట్లు. వాటిలో స్థిరాస్తులు రూ.82.23 కోట్లయితే, రూ.39.31 కోట్లు చరాస్తులు.
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్ గోయల్ ఆస్తులు రూ.110.95 కోట్లు. వాటిలో రూ.21.09 కోట్ల చిరాస్తులు, రూ.89.87 కోట్లు చరాస్తులు.
99 శాతం కేంద్ర కొత్త మంత్రులంతా కుబేరులే. 71 మంది మంత్రుల్లో 70 మంది ఆస్తులు విశ్లేషిస్తే అందరూ కోట్లు దాటిన వారే. జాతీయ రాజకీయాల్లో సంపన్నుల పాత్ర గణనీయంగా పెరుగుతుందని ఈ గణాంకాలు చెబుతున్నాయని ఏడీఆర్ పేర్కొంది.