Women for Home | భారతీయుల్లో.. అందునా మహిళామణులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలకు, పండుగల వేళ బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ధోరణి. కానీ పరిస్థితులు మారుతున్నాయి. పద్దతులూ మారుతున్నాయి. కేవలం వందకు ఎనిమిది మంది మాత్రమే బంగారంపై మనస్సు పారేసుకుంటున్నారని తేలింది. వారు ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి బదులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అనరాక్ అనే రియాల్టీ సంస్థ నిర్వహించిన వినియోగదారుల సర్వేలో తేలింది. 65 శాతం మంది తమ పెట్టుబడికి తొలి ప్రాధాన్యం రియల్ ఎస్టేట్ అని చెప్పారని అనరాక్ సర్వే నివేదిక వెల్లడించింది. మరో 20 శాతం మంది స్టాక్స్మీద, 7 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సర్వే సారాంశం.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్న మహిళల్లో 83 శాతం సమీప నగరాల్లో సొంతింటిని కొనుగోలు చేయడానికి మొగ్గుతున్నారు. వారిలో 36 శాతం మంది రూ.45-90 లక్షల మధ్య క్యాటగిరీ, 27 శాతం మంది రూ.90 లక్షలు-రూ.1.5 కోట్లు, ఒక 20 శాతం మంది రూ.1.5 కోట్ల పై చిలుకు బడ్జెట్లోనైనా ఇల్లు కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అనరాక్ నివేదిక వెల్లడించింది. రూ.45 లక్షల్లోపు బడ్జెట్ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపింది.
గత దశాబ్ధి కాలంలో సొంతిండ్ల కొనుగోళ్లు.. ప్రధానంగా నగరాల్లో సొంతిండ్ల కొనుగోలులో మహిళలు ప్రధాన శక్తిగా అవతరించారని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. పెద్ద ఇండ్లకు, తమ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్దిష్టమైన బడ్జెట్లో ఇండ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇండ్ల కొనుగోలులో మిలీనియల్స్ తరహాలో తమకు నచ్చిన ఇంటి కొనుగోలు విషయంలో మహిళలు వెనుకడుగు వేయడం లేదన్నారు. ఇండ్ల కొనుగోలుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధి చేకూరడం ఇందుకు కారణం అని చెప్పారు. బ్యాంకులు మహిళలకు వడ్డీ రాయితీ ఎక్కువ ఇస్తున్నాయని గుర్తు చేశారు.