హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : బొగ్గు విక్రయాల ద్వారా లాభాల కంటే నష్టాలు అధికంగా వస్తున్నాయని, ఒక టన్ను విక్రయిస్తే రూ. 5 -6 వేల వరకు నష్టం వాటిళ్లుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సింగరేణిభవన్‌లో ‘ఉజ్వల సింగరేణి -ఉద్యోగుల పాత్ర’ అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ.. భూగర్బంలో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ. 10 వేల వరకు ఖర్చవుతుండగా, అదే టన్నును విక్రయిస్తే రూ. 5 వేలే వస్తున్నదని, ఫలితంగా టన్నుకు రూ. 5 -6 వేలు నష్ట పోవాల్సివస్తున్నదన్నారు. కంపెనీ భవిష్యత్తు కోసం చేసిన డిపాజిట్ల నుంచి రూ.900 కోట్లు, థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి రూ. 500 కోట్ల లాభం సమకూరుతున్నదన్నారు. కోలిండియా బొగ్గు ధరకన్నా..సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు కోలిండియా బొగ్గును కొంటున్నారని, ఇది సంస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్నారు. ఉద్యోగులంతా 8గంటల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, యంత్రాలను పూర్తిగా వినియోగించి ఉత్పాదకత పెంచాలని కోరారు.