త్రిస్సూర్, ఆగస్టు 13: దేశీయ రిటైల్ నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థ జోస్ ఆలుక్కాస్.. 60 ఏండ్ల వేడుకలకు వేదికైంది. 1964లో కేరళలోని త్రిస్సూర్‌లో మొదలైన ఈ సంస్థ.. తెలంగాణ, ఏపీసహా దక్షిణాది రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది. గల్ఫ్‌లోనూ వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు 60వ వార్షికోత్సవాలను జరుపుకొంటున్నది. ఇందులో భాగంగా తమ కస్టమర్లకు రూ.6 కోట్ల విలువైన బహుమతులను అందిస్తున్నది. వీటిలో 6 ఎంజీ ఆస్టర్ కార్లతోపాటు వివిధ రకా ల గృహోపకరణాలు, బంగారు నాణేలూ ఉన్నాయి. అంతేగాక వజ్రాభరణాలపై 20 శాతం, ప్లాటినం నగలపై 7 శాతం తగ్గింపునూ పొందవచ్చు. ఆకర్షణీయ రీతిలో డైమండ్ జ్యుయెల్లరీ ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నది.
హీరో లాభం 1,032 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ లాభా లు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,032 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.701 కోట్లతో పోలిస్తే 47 శాతం వృద్ధిని కనబరిచింది. అమ్మకాలు భారీగా పుంజుకోవడం వల్లనే ఆకర్షణీయమైన లాభాలు నమోదుచేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,851 కోట్ల నుంచి రూ.10,211 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
రెయిన్బో ప్రాఫిట్ డౌన్
హైదరాబాద్, ఆగస్టు 13: రెయిన్బో హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రవేశపెట్టింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ.40 కోట్లకు పరిమితమైంది. ఆదాయం మాత్రం 15 శాతం ఎగబాకి రూ.330 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో కొత్తగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఆసుపత్రులను ప్రారంభించడం కొత్తగా 280 పడకలు అందుబాటులోకి రానున్నాయి.