Hyderabadis in Mutual Funds | బీమా పాలసీలు.. ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు మదుపు నిర్ధిష్ఠ లాభాలను మాత్రమే అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఐపీవోల్లో పెట్టుబడులతో గణనీయంగా లాభాలు గడించొచ్చు. ఇంతకుముందుతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లో పెట్టుబడులు పెట్టే హైదరాబాదీలు క్రమంగా పెరుగుతున్నారు. గ్రూ ( Groww ) అనే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం సగానికి పైగా హైదరాబాదీలు మ్యూచువల్ ఫండ్స్, మిగతా వారు స్టాక్స్, ఐపీవోల ద్వారా లిస్టెడ్ కంపెనీల్లో స్టాక్స్ కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణలో 13,85,623 మంది ఇన్వెస్టర్లు ఉంటే వారిలో 56 శాతం మంది భాగ్యనగర వాసులే. అందులోనూ కుర్రాళ్లు ( young investors ) పెట్టుబడులకు గణనీయంగా మొగ్గు చూపుతున్నారు. 22.85 శాతం మంది 25-30 ఏండ్ల లోపు వయస్సు గలవారు, 18-24 ఏండ్ల మధ్య వయస్సు గల వారు 19.24 శాతం, 31-40 ఏండ్ల మధ్య వయస్సు గలవారు 17.13 శాతం మంది ఉన్నారని గ్రూ పేర్కొంది.
56 శాతం మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్, 38 శాతం మంది స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే, కేవలం 2.92 శాతం మంది ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారని గ్రూ సర్వే అభిప్రాయ పడింది. తెలంగాణలో 47 శాతం మంది స్టాక్స్, 45 శాతం మంది మ్యూచువల్ పండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాదీల్లో వందకు ఐదుగురు ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు.
హైదరాబాదీల్లో పెట్టుబడులు పెట్టేవారు కొన్నేండ్లుగా పెరుగుతున్నారని గ్రూ కో-ఫౌండర్ కం సీఈవో హర్ష్ జైన్ తెలిపారు. వారిలో యువ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్వెస్ట్మెంట్లకు మొగ్గుతున్నారని చెప్పారు.