హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టుబోతున్నది. ఎలక్ట్రానిక్, ఐటీతోపాటు ఇతర ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా టెలికం దిగ్గజం మైక్రోలింక్ నెట్వర్క్స్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడానికి ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని మంత్రి చెప్పారు. గురువారం సచివాలయంలో మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులతో పాటు పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీరంగారావుతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
పీఎస్ఆర్ సంస్థ ఏర్పాటు చేయనున్న పరిశ్రమలతో వచ్చే మూడేండ్లకాలంలో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా పర్యటనలోభాగంగా మైక్రోలింక్ నెట్వర్క్స్ యాజమాన్యం, పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని, ఇరు సంస్థల సాంకేతిక బదిలీకి అంగీకరించాయని పేర్కొన్నారు.