న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో నియామకాలకు భారీ ఎత్తున కత్తెర పెట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దాదాపు 40 శాతం తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. టీమ్‌లీజ్ డాటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీలు సుమారు 2.8 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో రిక్రూట్మెంట్లు పెద్దగా పెరగకపోవచ్చంటున్న టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్.. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం 30-40 శాతం పడిపోవచ్చని వ్యాఖ్యానించారు. కంపెనీల వృద్ధి అంచనాలూ ప్రభావితం కావచ్చన్నారు. ఇప్పటికే నియామకాల విషయంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్న సంగతి విదితమే.
అంతర్జాతీయ ఒత్తిళ్లతో..
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ వైఫల్యాలు.. భారతీయ ఐటీ పరిశ్రమ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే 2021-22, 2022-23 ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో కనిపించిన ఉత్సాహం.. గత ఆరు నెలలుగా (నిరుడు అక్టోబర్ నుంచి) ఉండట్లేదని టీమ్‌లీజ్ చీఫ్ అంటున్నారు. గత ఏడాది జనవరి-మార్చితో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఐటీ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు తగ్గవచ్చని ఐటీ సంస్థలకు స్టాఫింగ్ సొల్యూషన్స్‌ను అందించే జెఫెనో సైతం చెప్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం నియామకాల్లోనూ మందగమనం కనిపిస్తుందని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన కమల్ కరంత్ అన్నారు.
ఉద్యోగాల కోతలు
ఆర్థిక మాంద్యం భయాల నడుమ ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసేస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 19,000 మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగ్నిజెంట్ మాత్రమే 5,900 మందిని కొలువుల్లోకి తీసుకున్నప్పటికీ.. ఈ రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) కొత్త ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దన్న సంకేతాలను ఇస్తున్నది. కాగా, నైపుణ్యం గల ఉద్యోగులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ప్రతిభ లేని, ప్రాధాన్యత కాని రంగాల్లో పనిచేస్తున్నవారిపై మాత్రం వేటు తప్పకపోవచ్చని ఐఎస్జీ ప్రధాన విశ్లేషకుడు మృణాల్ రాయ్ అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు అంతర్జాతీయ సంస్థల ఆఫ్-షోరింగ్.. ప్రయోజనకరంగా ఉండే వీలుందని అడెక్కో ఇండియా డైరెక్టర్ ఏఆర్ రమేశ్ అన్నారు.