Donald Trump | వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 27: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కానీ, అమెరికాలో తయారైన కార్లపై ఎలాంటి సుంకం ఉండదని స్పష్టంచేయడం విశేషం. ఈ సుంకం పెంపు వచ్చే వారం నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.
ఇది శాశ్వతమైన చర్యగా పేర్కొన్న ఆయన.. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతియేటా 100 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం విదేశీ ఆటోమొబైల్ సంస్థలకు షాకిచ్చినట్లు అయింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ సుంకాల పెంపును తెరపైకి తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఏ వస్తువుపైన 25 శాతం సుంకం విధించనున్నట్లు గతంలోనే పేర్కొన్నారు.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో విదేశీ ఆటోమొబైల్ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యూఎస్‌కు ఎగుమతి చేయాలంటే అధికంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ ధరలు పెంచితే వాహన అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో సరాసరి కారు ధర 49 వేల డాలర్లు ఉండగా, త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే కారుపై విధిస్తున్న సుంకం 12,500 డాలర్లకు ఎగబాకనున్నది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ ఎగుమతులపై నీలినీడలు కమ్ముకోనున్నది.
ప్రతియేటా భారత్ నుంచి 7 బిలియన్ డాలర్ల విలువైన కార్లు అమెరికాకు ఎగుమతి అవుతుండగా..తాజా నిర్ణయంతో ఆయా సంస్థలు వెనక్కితగ్గే అవకాశాలున్నాయి. ప్రధానంగా యూఎస్ మార్కెట్లో పాగావేసిన టాటా మోటర్స్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్పై ఈ ప్రభావం అధికంగా పడనున్నది. బ్రిటన్ ప్లాంట్‌లో తయారైన జేఎల్ఆర్ వాహనాలను ప్రతియేటా లక్షల వాహనాలను అమెరికాకు ఎగుమతి చేస్తుండటమే ఇందుకు కారణం. సుంకాల పెంపు ప్రతిపాదనపై వాహన సంస్థలతోపాటు వాహన విడిభాగాల తయారీ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ టారిఫ్ బాదుడుతో తమ ఉత్పత్తుల విక్రయాలపై ప్రభావం చూపనున్నాయని వారు వాపోతున్నారు. 2024లో భారత్ నుంచి 2.2 బిలియన్ డాలర్ల విడిభాగాలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ ఆటోమొబైల్ రంగ షేర్లు కుప్పకూలాయి. టాటా మోటర్స్ షేరు అత్యధికంగా 5.50 శాతం నష్టపోయింది. దీంతోపాటు అశోక్ లేలాండ్ 2.77 శాతం తగ్గగా, ఐచర్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో టైర్స్ షేర్లు పతనం చెందాయి. మొత్తంగా ఆటో ఇండెక్స్ ఒక్క శాతం తగ్గి 48,220.85కి పడిపోయింది. వీటితోపాటు వాహన విడిభాగాల తయారీ సంస్థల షేర్లు కూడా ఒత్తిడికి గురయ్యాయి. సోనా బీఎల్డబ్ల్యూ షేరు 5.89 శాతం నష్టపోగా, సంవర్ధన్ మథర్సన్ ఇంటర్నేషనల్ 2.22 శాతం, భారత్ ఫోర్జ్ 2.30 శాతం, ఏఎస్కే ఆటోమోటివ్ లిమిటెడ్ 1.83 శాతం, రామ్కృష్ణ ఫార్జింగ్స్ షేర్లు పతనం చెందాయి.
కొన్ని అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. అయితే అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. 23 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ప్రతియేటా భారత్ దిగుమతి చేసుకుంటున్నది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌ను 55 శాతం వరకు తగ్గించడానికి భారత్ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.