GJEPC | ముంబై, ఆగస్టు 21: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 22 శాతం తగ్గి 1,665.4 మిలియన్ డాలర్లకు పడిపోయాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా, చైనా దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఆభరణాలకు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు.
అలాగే కట్, పాలిష్ డైమండ్ల ఎగుమతులు కూడా 21 శాతం తగ్గి 1,174 మిలియన్ డాలర్ల నుంచి 907.67 మిలియన్ డాలర్లకు తగ్గాయని పేర్కొన్నారు. బంగారం ఆభరణాలు కూడా 10.53 శాతం తగ్గి 603 మిలియన్ డాలర్ల నుంచి 530.38 మిలియన్ డాలర్లకు దిగాయని తెలిపింది.