GST | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: జీఎస్టీ ఎగవేతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) గుర్తించింది. 2024-25లో 6,084 కేసులు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు, వీటి విలువ రూ.2.01 లక్షల కోట్లని శనివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
సేవల విభాగంలో ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, తుక్కు వంటి విభాగాల్లో జీఎస్టీ ఎగవేతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. 2022-23లో నమోదైన 4,872 కేసుల జీఎస్టీ ఎగవేత రూ.1.01 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలు పెరిగింది. జీఎస్టీ ఎగవేతల్లో పన్నుకు సంబంధించినవి 46 శాతంగా ఉండగా, 20 శాతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, 19 శాతం ఐటీసీకి సంబంధించినవని పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ రంగంలో రూ.81 వేల కోట్ల ఎగవేతలు జరిగాయని తెలిపింది.