న్యూఢిల్లీ, జూన్ 11 : భారత్‌లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్‌ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025లో తెలిపింది. అమెరికా, చైనా, జపాన్ తర్వాత భారత్ కావడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం, వ్యాపార సానుకూల అంశాలు కుబేరుల సంపద పెరగడానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది.
అలాగే 2023లో 165 మంది ఉన్న బిలియనీర్లు ఈ ఏడాదికిగాను 191కి చేరుకున్నట్లు తెలిపింది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినిమయం పుంజుకోవడం, డిజిటల్ బ్యాంకింగ్‌తో లావాదేవీలు మరింత సులభతరమయ్యాయని పేర్కొంది. గడిచిన ఏడాదికాలంలో కొత్తగా 26 మంది బిలియనీర్లు జతయ్యారని తెలిపింది. 2019 తర్వాత ఒకే ఏడాది ఇంత మంది చేరడం ఇదే తొలిసారని తెలిపింది. వీరి నికర సంపద 0.95 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. మొత్తం కుబేరుల్లో 30 శాతం మంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారని తెలిపింది.