Telangana | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే వెసులుబాటు కూడా ఉన్నది. ప్రాజక్టు నివేదిక సిద్ధంగా ఉంటే బ్యాంకు నుంచి రుణాలు పొంది వెంటనే నిర్మాణం పనులు చేపట్టవచ్చు.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలవారీగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామికవాడల్లో కొన్ని జనరల్ ఇండస్ట్రియల్ పార్క్‌లు కాగా, మరికొన్నింటిని ప్రత్యేక రంగాలకు ప్రత్యేకించారు. ఉదాహరణకు వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లోని ప్లాట్లలో వస్త్ర పరిశ్రమలను, ఖమ్మం బిగ్గుపాడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లోని ప్లాట్లలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు. జనరల్ పార్కుల్లోని ప్లాట్లలో మాత్రం నిబంధనలకు లోబడి ఎలాంటి పరిశ్రమనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జోన్లవారీగా ఆయా జిల్లాల్లో 500 చదరపు మీటర్ల నుంచి గరిష్ఠంగా 15 ఎకరాల వరకు వైశాల్యం గల ప్లాట్లను సిద్ధం చేసి, స్థానిక భూముల ధరల ఆధారంగా వీటికి ధరలను నిర్ధారించారు. ఖమ్మం, యాదాద్రిలో ప్లగ్అండ్ప్లే సౌకర్యంతో షెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకొని ఈ ప్లాట్లను సొంతం చేసుకోవచ్చు.
28