న్యూఢిల్లీ, మే 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 18 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు, వీరిలో 13,400 మంది క్లరికల్ కాగా, మరో 3 వేల మంది ప్రొబెషనరీ ఆఫీసర్లు, 1,600 మంది స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి సిబ్బందని పేర్కొన్నారు.
ఈ నూతన ఆర్థిక సంవత్సరంలోనూ నికర వడ్డీ మార్జిన్లు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, రిజర్వుబ్యాంక్ ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లే కారణమన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.18,643 కోట్లకు పరిమితమవగా, ఆదాయం రూ.1,43,876 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది.