న్యూఢిల్లీ, జూలై 23: సామాన్యుడి నుంచి ముక్కుపిండి రుణాలు వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు…కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాయి. గడిచిన పదేండ్లకాలంలో పీఎస్‌బీలు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ సర్కార్ పార్లమెంట్లో వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ..పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21 నుంచి 2024-25 వరకు ఐదేండ్లలోనే రూ.5.82 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు తమ ఖాతా బుక్లనుంచి తొలగించాయి. మొత్తంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 2015-16 నుంచి 2024-25 వకు అక్షరాల రూ.12.08 లక్షల కోట్ల రుణాలను తమ ఖాతా బుక్‌ల నుంచి తొలిగించాయి.
రైటాఫ్ అనేది సాంకేతికగా అకౌంటింగ్ విధానం నుంచి తొలగిస్తారు తప్పా..రుణ గ్రహీత రుణాన్ని మాఫీ చేయడంగా పరిగణించడం లేదని ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇటువంటి పద్దులను మాఫీ చేయడం లేదని, అందువల్ల రుణ గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని చౌదరి పేర్కొన్నారు. అలాగే రుణ గ్రహీతలు తమ రుణాలు తిరిగి చెల్లించాల్సిన ఉంటుందన్నారు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు నడుచుకుంటాయి తప్పా..రుణాల మాఫీకి సంబంధించి ఆయా సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, అలాగే బ్యాంకుల నిరర్థక ఆస్తులు సాధారణంగా నాలుగు సంవత్సరాల తర్వాత తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగిస్తాయన్నారు.
మరోవైపు, మార్చి 31, 2025 నాటికి 1,629 మంది ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారులను గుర్తించినట్టు, వీరు ఏకంగా పలు బ్యాంకుల వద్ద రూ.1.62 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రైటాఫ్ అయిన రుణాలను సర్ఫేస్ యాక్ట్, దివాలా చట్టం ద్వారా బ్యాంకులు తిరిగి వసూలు చేయడానికి కీలక చర్యలు తీసుకుంటున్నాయని, తద్వారా ఇప్పటి వరకు వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మంత్రి చెప్పారు. మరోవైపు, మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
రుణాలను రైటాఫ్ చేసిన బ్యాంకుల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తొలిస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, వీటిలో పది బ్యాంకులు భారీగా రుణాలను రైటాఫ్ చేశాయి. ఎస్బీఐతోపాటు కెనరా బ్యాంక్‌లు చేసిన రైటాఫ్ రుణాలు భారీగా పెరిగాయి. మరోవైపు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. గడిచిన ఐదేండ్లలో 1.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. మరోవైపు, 48,570 మంది రిక్రూట్మెంట్లకు సంబంధించి ప్రాసెసింగ్ జరుగుతున్నదని మంత్రి చెప్పారు.