న్యూఢిల్లీ, అక్టోబర్ 8: రూపాయిని పటిష్ఠస్థాయిలో నిలిపేందుకు విలువైన విదేశీ మారక నిల్వల్ని విచ్ఛలవిడిగా ఖర్చుచేసినా ఫలితం దక్కలేదు. భారత్ వద్దనున్న ఫారిన్ కరెన్సీ నిల్వలు కేవలం ఏడాదికాలంలో 110 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయాయి. కానీ ఇదే సమయంలో రూపాయి విలువ 73 స్థాయి నుంచి 82.43 స్థాయికి (12.8 శాతం) పతనమయ్యింది. 2021 సెప్టెంబర్ 3న 642.45 బిలియన్ డాలర్లున్న నిల్వలు 2022 సెప్టెంబర్ 30కల్లా రెండేండ్ల కనిష్ఠం 532.66 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి. 2020 అక్టోబర్ 2 తర్వాత ఇంత కనిష్ఠస్థాయికి తగ్గడం ఇదే ప్రథమం. ఈ నిల్వల్లో కరెన్సీ, బంగారం, ఎస్‌డీఆర్‌లు ఉంటాయి. వీటిలో అత్యధికభాగం కలిగిన కరెన్సీ నిల్వలు ఇదేకాలంలో 580 బిలియన్ డాలర్ల నుంచి 472.80 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ భారీ క్షణతకు కారణం చాలావరకూ రిజర్వ్‌బ్యాంక్ రూపాయి పతనాన్ని నిరోధించడానికి ఖర్చుచేయడమే. మరికొంత తరుగుదల నిల్వల డీవాల్యుయేషన్ కారణంగా జరిగింది. ప్రస్తుతం దేశం వద్దనున్న విదేశీ మారకం కేవలం 9 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. గత ఏడాది ఇదే సమయంలో 15 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారకం ఉండేది.
80 దిగువకు తగ్గకుండా విఫలయత్నం
80 స్థాయిని రూపాయి కోల్పోకుండా నిలిపిఉంచేందుకు రిజర్వ్‌బ్యాంక్ విఫలయత్నం చేసింది. భారీగా డాలర్లను ఖర్చుచేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనపుడు మార్చి నెలలో 20 బిలియన్ డాలర్లను ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో విక్రయించింది. ఈ ఏడాది జూలైలో తొలిసారిగా రూపాయి 80 స్థాయికి పతనమైనపుడు అంతేకంటే దిగువకు తగ్గకుండా బిలియన్ల కొద్దీ డాలర్లను మార్కెట్లోకి వదిలిపెట్టింది. జూన్, జూలైలో 23 బిలియన్ డాలర్లు కేవలం దేశీ కరెన్సీ క్షీణతను నిలువరించేందుకే వ్యయమయ్యాయి. సెప్టెంబర్ ప్రథమార్థంలో సైతం 10 బిలియన్ డాలర్లు వెదజల్లింది. అయినా మూడు వారాల క్రితం 80 స్థాయిని రూపాయి బ్రేక్‌చేసి, శరవేగంగా ఆల్‌టైమ్ కనిష్ఠం 82.43 స్థాయిని తాకింది. కరెన్సీ భవిష్యత్తులో మరింత క్షీణిస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వాణిజ్యలోటు పోటు
ఎగుమతులు వృద్ధి క్రమేపీ తగ్గుతూ, దిగుమతుల విలువ పెరగడంతో వరుసగా నాలుగు నెలల నుంచి 28-30 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడుతున్నది. అంటే దిగుమతుల కోసం విదేశీ కరెన్సీ నిల్వల నుంచి నెలకు దాదాపుగా 28 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే. విదేశీ నిల్వలు వేగంగా తగ్గకుండా ఫార్వర్డ్ మార్కెట్లో రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను కొంటూ ఉంటుంది. అటువంటి కొనుగోళ్లు సైతం ఇటీవల తగ్గించివేసింది. దీంతో ఆర్బీఐ డాలర్ ఫార్వర్డ్ బుక్ ఏడాదికాలంలో 49 బిలియన్ డాలర్ల నుంచి 22 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.