FASTag Annual Pass | స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశంలో ఫాస్టాగ్ టోల్ చెల్లింపు విధానంలో పెనుమార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తరచూ ప్రయాణించే వారికి మరింత సులభ, చౌక హైవే ప్రయాణాన్ని కల్పించేందుకు కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాసును (FASTag Annual Pass) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రవేశపెట్టిన రూ.3,000 వార్షిక హైవే టోల్ పాసు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాల్లో FASTag వార్షిక పాస్ సౌకర్యాన్ని ఎన్హెచ్ఏఐ విజయవంతంగా అమలు చేసింది. తొలి రోజు సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నుట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. అదేవిధంగా టోల్ ప్లాజాల్లో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదైనట్లు తెలిపింది. ఈ వార్షిక పాస్ తీసుకున్న వినియోగదారులు ఎస్ఎమ్ఎస్ ద్వారా జీరో టోల్ మెసేజ్ అందుకుంటున్నట్లు ఎన్హెచ్ఏఐ వివరించింది.
ఎవరికి వర్తిస్తుంది?
ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ వర్తిస్తుంది. ఎన్హెచ్ఏఐ నిర్వహించే జాతీయ హైవేలు, ఎక్స్ప్రెస్వేలపైన టోల్ చార్జీలు చెల్లించేందుకు ఒకేసారి డబ్బు చెల్లించి ఫాస్టాగ్ వార్షిక పాసును తీసుకోవచ్చు. ఈ పథకం కింద వాహన యజమానులు ఒకేసారి రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిపాటు ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన జాతీయ రహదారుల్లో 200 వరకు టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఒకవేళ గరిష్ఠ పరిమితి (200 టోల్ క్రాసింగ్‌లు) ఏడాదిలోపలే ముగిసిపోతే ఆటోమేటిక్‌గా సాధారణ విధానంలోకి ఫాస్టాగ్ మారిపోయి డబ్బు చెల్లించి టోల్ దాటవలసి ఉంటుంది.
పాసు ఎలా కొనాలి?
వార్షిక ఫాస్టాగ్ పాసు కొనేందుకు వాహనదారులు తమ వాహన నంబరు, ఫాస్టాగ్ ఐడీ ఉపయోగించి రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ/ఎంఓఆర్టీహెచ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. తమ ఫాస్టాగ్ యాక్టివ్‌గా, సక్రమంగా ఇన్స్టాల్ అయి ఉందో లేదో ధ్రువీకరించుకోవాలి. యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో రూ. 3,000 చెల్లించాలి. ఆగస్టు 15న పాసు యాక్టివేట్ అవుతుంది. యూజర్లకు ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ అందుతుంది. ఫాస్టాగ్ వార్షిక పాసు ఇతరులకు బదిలీ కాదు. రిజిస్టర్డ్ వాహనానికి మాత్రమే పనిచేస్తుంది. అంతేగాక ఈ పాస్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే మళ్లీ డబ్బు వాపసు వచ్చే అవకాశం ఉండదు. పాసు ఆటోమేటిక్‌గా రెన్యూ కాదు. దాని గడువు తీరిన తర్వాత మళ్లీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read..
Himachal Pradesh | భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 257 మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం
Shubhanshu Shukla | స్వదేశానికి బయల్దేరిన శుభాన్షు శుక్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం
Tungabhadra Dam | పనిచేయని మరో 7 గేట్లు.. తుంగభద్ర డ్యామ్‌కు పొంచిఉన్న ముప్పు..