Credit Card Spending | గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు ఆల్ టైం రికార్డులు నమోదవుతున్నాయి. గత మే నెలలో క్రెడిట్ కార్డులతో రూ.1.4 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
2022-23లో క్రెడిట్ కార్డుల వాడకం నిరంతరం సుస్థిరంగా సాగుతున్నది. ఈ ఏడాది ప్రతి నెలా ఐదు శాతం గ్రోత్ నమోదవుతున్నది. గత మే నెలలో కొత్తగా 50 లక్షల క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. దీంతో దేశంలో మొత్తం వినియోగిస్తున్న క్రెడిట్ కార్డుల సంఖ్య 8.74 కోట్లకు చేరుకున్నది.
గత మే నెలలో క్రెడిట్ కార్డుల వాడకం అత్యంత గరిష్టం అయినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో 20 లక్షల కొత్త కార్డులు జత కలిశాయి. 2023 జనవరిలో 8.24 కోటల క్రెడిట్ కార్డులే ఉన్నాయి. ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య 8.65 కోట్లకు చేరుకున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రూ.1.1 లక్షల కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. కానీ ఈ గత మే నెలలో రూ.1.4 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి క్రెడిట్ కార్డులు. మే నెలలో సగటున క్రెడిట్ కార్డుల వాడకం రూ.16.144గా ఉంది.
గత మే నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1.81 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు యాక్టివేట్ చేసింది. మొత్తం క్రెడిట్ కార్డుల రుణాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 28.5 శాతంతో మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాత స్థానంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు 1.71 కోట్ల కార్డులు, ఐసీఐసీఐ బ్యాంకు 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నది. రోజురోజుకు క్రెడిట్ కార్డుల వాడకంతోపాటు డిఫాల్ట్ అవుతున్న క్రెడిట్ కార్డుల సంఖ్య పెరుగుతున్నది.