Pawan Munjal | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్ కష్టాల్లో చిక్కుకున్నారు. హవాలా లావాదేవీల కేసులో పవన్ ముంజాల్, ఆయన సారధ్యంలోని హీరో మోటో కార్ప్ అధికారుల ఇండ్ల, కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో రూ.25 కోట్ల విలువైన విదేశీ, భారత్ కరెన్సీ, బంగారం, వజ్రాభరణాలను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జరిపిన తనిఖీల్లో లభించిన పత్రాలకు సరైన ఆధారాలు లేవని ఈడీ అధికారులు బుధవారం తెలిపారు.
ఢిల్లీతోపాటు గుర్గ్రామ్ ప్రాంతాల్లోని పవన్ ముంజాల్, ఆయన సంస్థ అధికారుల ఇండ్లలో మంగళవారం ఈడీ అధికారులు తనిఖీ చేశారు. ఈడీ అధికారులు తమ దాడుల్లో ఎంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నారన్న సంగతి వెల్లడించలేదు. ఈడీ సోదాలపై స్పందించేందుకు హీరో మోటో కార్ప్ స్పందించలేదు. ఈడీ దర్యాప్తునకు అన్ని రకాల సహకారం అందిస్తామని పేర్కొంది.
పవన్ ముంజాల్తోపాటు హీరో ఫైన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు హేమంత్ దాహియా, కేఆర్ రామన్తోపాటు హీరో మోటో కార్ప్ సంస్థ అధికారుల ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) ఫిర్యాదు ఆధారంగా హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని వివిధ సెక్షన్ల కింద వీరిపై ఈడీ కేసులు నమోదు చేసింది.
2014-15 నుంచి 2018-19 మధ్య సాల్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈఎంపీఎల్) ఆధ్వర్యంలో వివిధ దేశాలకు రూ.54 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ చట్టవిరుద్ధంగా ఎగుమతి చేశారని ఈడీ తెలిపింది. ఈ మొత్తం పవన్ కుమార్ ముంజాల్ వ్యక్తిగత ఖర్చుల కింద చూపారని ఈడీ అభియోగం. ఈ సంస్థ అధికారులు హేమంత్ దాహియా, ముదిత్ అగర్వాల్, అమిత్ మక్కర్, గౌతం కుమార్, విక్రం బజాజ్, కేతన్ కక్కర్ వేర్వేరు సంవత్సరాల్లో తమ వార్షిక పరిమితి కంటే ఎక్కువగా 2.5 లక్షల డాలర్లను విదేశాలకు మళ్లించారని, దీన్ని ఫారెక్స్ నిల్వల కింద మార్చేందుకు ప్రయత్నించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. సంస్థ ఇతర ఉద్యోగులు విదేశాలకు వెళ్లకుండానే భారీ మొత్తంలో ఫారిన్ ఎక్స్చేంజ్ లేదా ట్రావెల్ ఫారెక్స్ కార్డు ద్వారా భారీగా నగదు డ్రా చేసుకున్నారని తేలింది.
పవన్ కుమార్ ముంజాల్కు అత్యంత సన్నిహితుడు ఒకరు.. విదేశాల్లో పవన్ కుమార్ ముంజాల్ వ్యక్తిగత, వ్యాపార ఖర్చుల కింద సుమారు రూ.40 కోట్ల విదేశీ కరెన్సీ చట్ట విరుద్ధంగా ఎగుమతి చేశారని ఈడీ పేర్కొంది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా తదితర 40 దేశాల్లో హీరో మోటో కార్ప్ కార్యకలాపాలు సాగుతున్నాయి.