న్యూఢిల్లీ, జూలై 13: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం నుంచి జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ పూర్తిగా వైదొలిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 150 మిలియన్ డాలర్ల నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పేటీఎంకు చెందిన మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 2017 నుంచి పలుదఫాలుగా 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులుపెట్టింది.
2021లో పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 18.5 శాతం వాటా ఉండగా, అలాగే ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్‌కు 17.3 శాతం, ఎస్వీఎఫ్ ప్యాంథర్(కేమ్యాన్) లిమిటెడ్‌కు 1.2 శాతం వాటా ఉన్నది. ప్యాంతర్ లిమిటెడ్ తన పూర్తి వాటాను ఐపీవోలో భాగంగా రూ.1,689 కోట్లకు విక్రయించింది.
పేటీఎం ఐపీవో పూర్తైన తర్వాత 24 నెలలకు వైదొలుగుతామని సాఫ్ట్‌బ్యాంక్ గతంలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు వైదొలిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి పరిస్థితులను సాఫ్ట్‌బ్యాంక్ ముందుగా ఊహించలేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఒక్కో షేరును రూ.800 చొప్పున సాఫ్ట్‌బ్యాంక్ కొనుగోలు చేసింది.
ఇష్యూ ధర రూ.2,150 కాగా, 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1,995 వద్ద పేటీఎం షేర్లు లిస్టయ్యాయి. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ లావాదేవీలను నియంత్రిస్తూ రిజర్వు బ్యాంక్ ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీ షేరు ధర చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.310కి పడిపోయింది. ఈ జనవరి -మార్చిలో రూ.550 కోట్ల నష్టం వచ్చింది.