శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 26, 2020 , 03:13:03

పల్లె ప్రగతికి ప్రత్యేక యాప్‌

పల్లె ప్రగతికి  ప్రత్యేక యాప్‌

  •  పనులపురోగతి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
  • కార్యదర్శులకు రోజువారీ, అధికారులకు నెలవారీ కార్యాచరణ
  • పనుల్లో మరింత పారదర్శకత

పల్లె ప్రగతి పనుల్లో మరింత పారదర్శకత పెరగనుంది. గ్రామాల్లో అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, మౌలిక వసతుల వివరాలను ఈ యాప్‌లో నిక్షిప్తం చేయనున్నారు.   పంచాయతీ కార్యదర్శులతోపాటు ఎంపీవో, ఎంపీడీవో, డీపీవోలను ఈ యాప్‌లో భాగస్వాములను చేసింది. తద్వారా పల్లెలో చేపట్టే ప్రతి పనిని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరూ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. - ఇల్లెందు రూరల్‌ 


  పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ 5వ తేదీన పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మూడు సార్లు పల్లె ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు మెరుగ్గా పనిచేయడంతో గ్రామాలు ఆశించిన దానికంటే మెరుగుపడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేసింది. పారిశుధ్య కార్మికుల నియామకం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంప్‌యార్డ్‌, ఇంకుడు గుంతలు నిర్మాణాలు , నర్సరీల ఏర్పాటు వంటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చాలా వరకు అవి పూర్తికాగా కొన్ని పంచాయతీల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటి పనితీరులో పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి పల్లెలను ఆదర్శంవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం టీఎస్‌ పల్లె ప్రగతి యాప్‌ను ఆచరణలోకి తెచ్చింది.

పంచాయతీల్లో రోజువారీ కార్యచరణ

గ్రామపంచాయతీల్లో అధికారులు ఇక నుంచి రోజువారీ ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. గ్రామాల్లో సమస్యలను గుర్తించడం,  సమస్యను యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతోపాటు పరిష్కరించిన అనంతరం కూడా మరోసారి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  దీని ద్వారా అభివృద్ధి పనుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుంది.

క్రమం తప్పకుండా తనిఖీలు

గ్రామపంచాయతీలో రోజువారీగా చేపట్టే పనులను పంచాయతీ కార్యదర్శులు క్రమం తప్పకుండా అప్‌లోడ్‌ చేస్తారు. మండల స్థాయి తనిఖీ అధికారులు యాప్‌ను పరిశీలించి గ్రామాలను సందర్శించిన సమయంలో యాప్‌లో పొందుపర్చిన అంశాలను పరిశీలిస్తారు. మండల స్థాయిలో ఎంపీవో ప్రతి నెలా 16 గ్రామపంచాయతీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 12 గ్రామపంచాయతీల పేర్లను పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ నుంచి సూచిస్తారు. మిగతా నాలుగు గ్రామపంచాయతీలను ఎంపీవో స్వయంగా ఎంపిక చేసుకొని తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికను డీపీవో ద్వారా  కలెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది.

  గ్రామాలు ఆదర్శంగా రూపుదిద్దుకుంటాయి..

గ్రామాలను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌ పల్లె ప్రగతి యాప్‌ను రూపొందించింది. గ్రామాలలో చేపట్టే పనులను కార్యదర్శులు ఫోటోలతో ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తుండటం ద్వారా పనులలో పారదర్శకత పెరుగుతుంది. పనులు ఏ మేరకు జరిగాయి, నాణ్యత ఎలా ఉంది.. మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఎలా సూచనలు అవసరం వంటి అంశాలపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరిలో స్పష్టత ఉంటుంది.      

- అరుణ్‌గౌడ్‌, ఎంపీవో, ఇల్లెందు మండలం.