బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 19, 2020 , 01:04:38

అమరవీరుల స్థూపం ఏర్పాటుకు స్థల పరిశీలన

అమరవీరుల స్థూపం ఏర్పాటుకు స్థల పరిశీలన

  • ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  •  ప్రగతి మైదాన్‌లో నాటిన మొక్కలు పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్‌ 

కొత్తగూడెం అర్బన్‌ : తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రగతి మైదాన్‌లో స్థూపం ఏర్పాటు చేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ప్రగతిమైదాన్‌లో స్థూపం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖాధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా అనువుగా ఉన్న స్థలాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైదానం అంతా కలియ తిరిగి  పరిశీలించారు. సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. వచ్చే నెల ఆగష్టు 15నాటికి అమరవీరుల స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించి పూర్తి చేయాలన్నారు. అలాగే ఆరోవిడత ‘హరితహారం’లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. సుమారు 8 నుంచి 10 అడుగులు ఉన్న 400మొక్కలను పక్కా ప్రణాళికతో నాటడంపై మున్సిపల్‌ కమిషనర్‌ను అభినందించారు. పెరిగిన చెట్ల మధ్య పూలమొక్కలు నాటాలని, వాకింగ్‌ చేస్తున్నవారికి, మైదానంలో ఆటలాడేవారికి ఇది ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు.

నాటిన మొక్కల రకాలపై పేర్లు తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇదే స్ఫూర్తితో మిగిలిన పట్టణాల్లో కూడా మొక్కలు నాటే విధంగా చర్యలను చేపట్టాలని తెలిపారు. త్వరలో మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని అపరిశుభ్రత ఉన్న, మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  నెలలో రెండురోజులు ప్రజలంతా శ్రమదానం నిర్వహించి పట్టణాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అశోకచక్రవర్తి, ఆర్డీఓ కె.స్వర్ణలత, పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి పి.కృపాకర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.సంపత్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ సుధాకర్‌రావు, తహసీల్ధార్‌ వి.రవికుమార్‌, సర్వేయర్‌ లక్ష్మణ్‌రావు, ఏఈ నాగేందర్‌ పాల్గొన్నారు.