Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇండ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా.. పోలీసుల కస్టడీలో ఉండగా ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. ఒక్కసారిగా ఇబ్బందులకు గురవగా.. వెంటనే పోలీసులు కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వంశీ అస్వస్థతకు గురయ్యారన్న వియం తెలుసుకున్న ఆన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని మాట్లాడుతూ వల్లభనేని వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆయన తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున కంకిపాడు ఆసుపత్రి నుంచి మెరుగైన సౌకర్యాలున్న ఎయిమ్స్ లాంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.