YS Sharmila | సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా ? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా అని ప్రశ్నించారు.
అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారని.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారని.. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారని అన్నారు. మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదమని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసమని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం.. అమలు మాత్రం అరచేతిలో వైకుంఠమని ఎద్దేవా చేశారు.
అంతకుముందు పులివెందుల ఉప ఎన్నిక ఫలితాలపై వైఎస్ షర్మిల స్పందించారు. గతంలో కుప్పంలో వైసీపీ చేసిందే ఇప్పుడు పులివెందులలో టీడీపీ చేసిందని అన్నారు. జగన్కు, చంద్రబాబుకు పెద్ద తేడా లేదని తెలిపారు. కుప్పంలో ఆనాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. ఈనాడు పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తాలిబన్ల లెక్క వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు కలిసి ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు మోదీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఇద్దరు నాయకులు నోరు ఎత్తడం లేదని షర్మిల అన్నారు. ఎందుకంటే ఒకరిది బహిరంగ పొత్తు. మరొకరిది అక్రమ పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.