YS Jagan | వైసీపీ సోషల్మీడియా యాక్టివిస్ట్ కుంచాల సవీంద్ర రెడ్డి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ఆదేశాలు ఏపీలోని పరిస్థితులను వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు సర్కార్లో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. వాక్ స్వాతంత్య్రాన్ని కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. సెక్షన్ 111 దుర్వినియోగం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. సోషల్మీడియా యాక్టివిస్ట్ సవీంద్రా రెడ్డి అక్రమ అరెస్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13వ తేదీ లోపు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.