దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన – అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి వీక్షించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే, హిందూయిజంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కౄరత్వమని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక వంకర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రీసర్వే సమస్యల పరిష్కారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది వరద నష్టంలో నిమగ్నమైనందున రీసర్వే సమస్యల పరిష్కారానికి కొంత గ్యాప్ వచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోందని అన్నారు.