Sujana Chowdari on AP Capital | అధికార వికేంద్రీకరణ పేరిట విద్వేష రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సుజనా చౌదరి స్పందించారు. పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో పేర్కొన్నట్లు అమరావతిని ఏపీ రాజధానిగా నాటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆనాటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని సుజనా చౌదరి గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ రాజధాని మార్చాలంటే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపాలన్నారు.
విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం చెల్లదని సుజనా చౌదరి చెప్పారు. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారన్నారు. కోర్టు అధికారాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ఉందని దబాయిస్తే వక్రీకరణలు వాస్తవాలు కావన్నారు.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో సీఆర్డీఏ చట్టబద్ధంగా ఒప్పందం చేసుకుందని సుజనాచౌదరి గుర్తు చేశారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సీఆర్డీఏను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ అసెంబ్లీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారమే లేదని చెప్పలేదన్నారు.