అమరావతి : ఏపీలో ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) ఆరోపించారు. కేంద్రం నుంచే వచ్చే నిధులను మళ్లించి బిందు సేద్యాన్ని(Drip Irrigation) నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. శుక్రవారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
రైతుల పట్ల తీవ్ర కక్ష పూరితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. బిందు సేద్యానికి కావల్సిన పనిముట్లకు తక్షణమే రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ (YCP) పాలనలో రూ. 1167 కోట్ల బకాయిలు పెట్టిందని విమర్శించారు. దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ను చివరిస్థానంలోకి తీసుకెళ్లారని ఆరోపించారు.