అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం (YS Jagan) వ్యక్తంచేశారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కుని చించేశారు. దీంతో పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారు?. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. అయితే జగన్ నిలదీత, సభ ప్రారంభం కావడంతో కాసేపటికే నల్లకండువాలతోనే వైసీపీ సభ్యులను పోలీసులు లోపలికి అనుమతించారు.
