Ambati Rambabu | హైదరాబాద్ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ – హర్షల వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్లో ఘనంగా జరిగింది. స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహ వేడుక కొనసాగింది. ఈ వివాహ వేడుకలో అంబటి రాంబాబు, ఆయన సతీమణితోపాటు వియ్యంకుడి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.
ఇక పెళ్లి జరిగిన అనంతరం నూతన వధూవరులను తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు అంబటి రాంబాబు పరిచయం చేశారు. తన కుమార్తె శ్రీజ ఎండోక్రైనాలజిస్ట్గా, తన అల్లుడు హర్ష సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అమెరికాలో పని చేస్తున్నారని తెలిపారు. హర్షది తణుకు అని పేర్కొన్నారు. వీరి వివాహం ఆంధ్రాలోనే జరగాల్సి ఉండే.. కానీ ట్రంప్ వ్యవహరశైలి కారణంగా అమెరికాలోనే అతి కొద్ది మంది సమక్షంలోనే చేయాల్సి వచ్చింది.. ఎందుకంటే మళ్లీ ఇండియాకు వస్తే ట్రంప్ తిరిగి రానిచ్చే అవకాశం లేదంటూ అంబటి రాంబాబు ఛలోక్తి విసిరారు. దీంతో వేదికపై అందరూ నవ్వేశారు.