అమరావతి : తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు (Pujas) పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan ) బుధవారం ఎక్స్ వేదిక ద్వారా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడుతున్నాని దుయ్యబట్టారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఈ నెల 28న పూజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.