కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ మరింత అప్రమత్తమైంది. అక్రమ కేసుల బారిన పడుతున్న తమ సోషల్మీడియా కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని, అన్ని విధాలుగా వారికి అందుబాటులో ఉండేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.
కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై, మరీ ముఖ్యంగా సోషల్మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై పెడుతున్న అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని, అన్ని విధాలుగా వారికి అందుబాటులో ఉండేందుకు ఈ సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమ కేసులకు సంబంధించి ఎలాంటి సహాయం కావాల్సిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
Ycp
కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు..
జె.సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్)
కొమ్మూరి కనకారావు (రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
దొడ్డా అంజిరెడ్డి ( రాష్ట్ర సోషల్మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్)
సోషల్మీడియా కార్యకర్త కిడ్నాప్
కూటమి ప్రభుత్వాన్ని సోషల్మీడియాలో ప్రశ్నించినందుకు నిన్న సాయంత్రం వైసీపీ కార్యకర్త నాని(నాగిరెడ్డి)ని మఫ్టీలో వచ్చిన తాడేపల్లి పోలీసులు ప్రైవేటు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. అయ్యప్ప దీక్షలో ఉన్న నానిని కనీసం పూజ కూడా చేసుకోనివ్వకుండా బలవంతంగా ఎత్తుకెళ్లారని వైసీపీ తెలిపింది.
నవంబర్ 3వ తేదీ అర్ధరాత్రిన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోషల్మీడియా కార్యకర్త బాలాజీ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే వైసీపీ లీగల్ సెల్ చొరవ చూపడంతో పాటు వెంటనే విడుదల చేశారు. ఇలా తమ సోషల్మీడియా కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న వైసీపీ.. తమ వారికి అండగా నిలబడేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం గమనార్హం.