YS Jagan | ఏపీ రాజకీయాల్లో రెడ్‌బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేశ్ తీసుకొచ్చిన ఈ రెడ్‌బుక్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ నాయకులపై ఏ కేసు పెట్టినా అది రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కూడా రెడ్‌బుక్‌కు అడ్వాన్స్డ్గా డిజిటల్ ఉద్యమానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల అండ కారణంగా ఏ అన్యాయం జరిగినా నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసేందుకు ఒక యాప్ తెచ్చేందుకు సిద్ధమైంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో మంగళవారం నాడు సమావేశమైన వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ జగన్.. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని.. ప్రభుత్వ వేధింపులు, అన్యాయం జరిగితే వెంటనే ఆ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో మంగళవారం నాడు జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మిథున్ రెడ్డి అరెస్టు బాధాకరమని అన్నారు. తమ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వేధింపులపై ఫిర్యాదుల కోసం పార్టీ తరఫున త్వరలోనే యాప్ విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఫలానా వ్యక్తి, ఫలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని ఆ యాప్‌లో ఫిర్యాదు చేసి, ఆధారాలు అప్లోడ్ చేస్తే సరిపోతుందని జగన్ తెలిపారు. ఆ ఫిర్యాదులన్నీ ఆటోమేటిగ్గా తమ డిజిటల్ సర్వర్లలోకి వచ్చేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అప్లోడ్ చేసిన ఫిర్యాదులకు సంబంధించిన వీడియోలు, పత్రాలు పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని అన్నారు. చంద్రబాబు ఏదైతే విత్తారో అదే చెట్టవుతుందని చెప్పారు.
పార్టీ నిర్మాణ కార్యక్రమంలో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలని వైఎస్ జగన్ కోరారు. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇందుకోసం అందరూ ఐకమత్యంగా పనిచేయాలని తెలిపారు. అంతర్గతంగా ఉన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్క తాటిపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడేది ఎవరన్నదే ఇప్పుడే బయటకొస్తుందన్నారు. పార్టీలో మంచి గుర్తింపు పొందేందుకు ఇదే మంచి అవకాశమని పేర్కొన్నారు. కార్యకర్తల విషయంలో గతంలో మాదిరిగా ఉండదని.. ఈసారి పెద్దపీట వేస్తామని తెలిపారు.