YCP | వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై తన అన్న జగన్, వదిన భారతిని తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ అభిమానులకు షర్మిల నిన్న ఒక లేఖను రాశారు. అయితే జగన్ కుటుంబంలో నెలకొన్న కుటుంబ తగాదాలను టీడీపీ రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టింది. షర్మిల లేఖలోని ముఖ్యమైన పాయింట్లను స్క్రీన్‌షాట్స్ తీసుకుని మరీ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. అయితే దీనిపై వైసీపీ మండిపడింది. వైఎస్ కుటుంబ తగాదాలపై టీడీపీకి ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించింది.
షర్మిల రాసిన లేఖను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్టు చేసి ఈ గొడవను రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశమేంటి అని వైసీపీ నిలదీసింది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదాంటారా అని ప్రశ్నించింది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఘోరమైన పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని ప్రశ్నించింది. దిగజారుతున్న లా అండ్ ఆర్డర్‌తో కడతేరుతున్న ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాల నుంచి, డయేరియా మరణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు రాజకీయాలు కాదా అని మండిపడింది.
రాజకీయంగా వైఎస్ జగన్ అంతాన్ని కోరుకుంటున్న వారితో తన వంతు పాత్ర పోషిస్తున్న ఘట్టం నేపథ్యంలో, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసేలా వైఎస్ జగన్ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో ఇవ్వదలుచుకున్న ఆస్తుల వివరాలతో కూడిన MOUను కూడా వెల్లడిస్తున్నామని పేర్కొంది. తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు కాకుండా వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నామని చెప్పింది.