AP News | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుడమేరు వరదలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద సాయంలో చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నేతలు వందల కోట్లను వెనకేసుకున్నారని విమర్శిస్తున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లు ఖర్చు చేసిందని చెబుతున్నారని పేర్కొన్నారు. వరదల పేరు చెప్పి వందల కోట్లు కొట్టేస్తారా? సంపద సృష్టి అంటే ఇదేనా అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారంటే అని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇంతలా ఉమ్మేస్తున్నా మీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
విజయవాడకు వరద కాదు కానీ చంద్రబాబు బ్యాచ్ పండుగ చేసుకుందని వైసీపీ విమర్శించింది. విరాళాల రూపంలో వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారని.. ఇష్టానుసారం బిల్లులు రాసుకుని కోట్లు కొట్టేశారని ఆరోపించింది. ఆహార సరఫరాకు రూ.368.18 కోట్లు, మంచి నీటి ప్యాకెట్లకు రూ.26.8కోట్లు, వైద్య సహాయానికి రూ.2.8 కోట్లు, నిత్యవసర వస్తువులకు రూ.61.28కోట్లు, కొవ్వొత్తులకు రూ.23.07కోట్లు ఖర్చు చేసినట్లు టీడీపీ లెక్కలు చెబుతున్నారని మండిపడింది. అసలు కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేయడమేంటని.. రాష్ట్రం మొత్తం దీపావళి పండుగ ఏమైనా చేశారా? ఏంటి ఈ అరాచకమని చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వరదల్లో 412 డ్రోన్ల ద్వారా పాల ప్యాకెట్లు పంచామని కూటమి ప్రభుత్వం చెబుతోందని.. అసలు విజయవాడలో 412 డ్రోన్లు ఉన్నాయా? అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అద్దె డ్రోన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. దాతల విరాళాల్ని జేబులో వేసుకుని బాధితులకు భారీగా ఖర్చు పెట్టినట్లుగా దొంగ లెక్కలు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ వరదసాయం అందకపోవడంతో విజయవాడలోని కలెక్టరేట్ చుట్టూ నిత్యం వేలాది మంది బాధితులు తిరుగుతున్నారని తెలిపారు. అయినా కూటమి నేతలకు ఇదేం బుద్ధి అని.. విరాళాల్ని కూడా వదలరా? అని మండిపడ్డారు.