Vijaysai Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. వీళ్లిద్దరూ ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వ్యంగ్యంగా స్పందించారు.
ఎంపీ విజయసాయి ట్వీట్..
‘ నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు.. “ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటున్నారు?”
శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, “ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు! “
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే దోపిడీ, మోసం, దగా అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సంపద సృష్టి లేదు.. 40 ఏళ్ల అనుభవం లేదు.. వంకాయ లేదు.. అంతా దోపిడీనే అని విమర్శించారు. మళ్లీ 3 వేల కోట్ల అప్పు చేశారు.. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు.
కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిసి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు తెచ్చి అప్పు దాదాపు 50 వేల కోట్లపై మాటే అని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించి ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7 వేల కోట్లు అని.. అది కాకుండా కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని తెలిపారు.
అయినప్పటికీ పిల్లలు తినే గోరుముద్దతో సహా జగన్ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు నడిపించడం లేదన్నారు. పాత బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి 10 రోజుల క్రితమే నివేదిక పంపినా, ఇప్పటివరకు సాయం గురించి ప్రకటన రాలేదని అన్నారు. అంతా దోపిడీ, మోసం, దగా అని విమర్శించారు.