నేను ఎలాంటి స్కామ్ చేయలేదు.. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోనని.. బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన 12 మంది నిందితులను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసు విచారణ సందర్భంగా ‘ నేను మూడుసార్లు ఎంపీగా పనిచేశా.. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను.. నేను ఎలాంటి స్కాం చేయలేదు.’ అని ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు ముందు తెలిపారు. ఇది అక్రమ కేసు అని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కాగా, ఏపీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. ఈ నెల 13వ తేదీ వరకు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 19వ తేదీన ఆయనను విజయవాడలోని కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం రాత్రి సమయంలో ఆయన్ను అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ రిమాండ్‌ను 13వ తేదీ దాకా పొడిగించింది.