AP News | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పార్టీని వీడటంతో.. మిగిలిన వారిపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో పార్టీ మార్పు ఊహాగానాలపై ఆయన స్పందించారు.
తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ గొల్లబాబురావు తెలిపారు. ఇలాంటి వదంతులను తాను లెక్కచేయనని స్పష్టం చేశారు. దళితుడిని కాబట్టే ఓ వర్గం తనపై దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. తాను ఎప్పటికీ జగన్‌కు విధేయుడిగానే ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో జీవితాంతం జగన్‌తోనే కలిసి నడుస్తానని చెప్పారు. అసవరం వచ్చినప్పుడు మాట్లాడతా.. పోరాడతా అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు. తనపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంపై చాలా బాధేస్తోందని చెప్పుకొచ్చారు.
రాజ్యసభలో వైసీపీ నుంచి మొత్తం 11 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు ఇప్పటికే వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. దీంతో వైసీపికి ఇప్పుడు 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య ఇప్పటికే స్పందించి తాము పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు. తాజాగా గొల్లబాబురావు కూడా పార్టీ మార్పు ఊహాగానాలపై స్పందించారు.