AP News | కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే వైసీపీ నేతలను టార్గెట్ చేసి.. వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా నెల్లూరులో మంత్రి నారాయణ.. వైసీపీ నేతలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేందుకు.. వైసీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బాలకృష్ణారెడ్డి కొత్తగా నిర్మించిన ఇంటిని అక్రమ నిర్మాణమని కూల్చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు.
మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు ఇంటిని కూల్చేయడం ఏమిటని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారని భావించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే.. నెల్లూరులో ప్రజల ఇళ్లను కూల్చివేసి.. వారి దుఃఖానికి కారణం అవుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఇది తగదని ఇలాంటి చర్యలను ప్రజలు ఎవరు ఉపేక్షించరని హెచ్చరించారు.
నెల్లూరులో ప్రజలకు అందించే సంక్షేమ పాలన ఇదేనా అని టీడీపీని పర్వతరెడ్డి నిలదీశారు. దీనికి నారాయణ, శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు టీడీపీ నేతలు.. వాళ్ల కార్యకర్తలను కాపాడుకోగలరా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి పరిణామాలు పునరావృతమైతే.. తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.