Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతలు ఉన్నందునే రాజీనామా చేశానని తెలిపారు.
ఫ్లోర్ లీడర్ పదవికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇస్తే బాగుంటుందని వైఎస్ జగన్ను కోరా. మరోసారి ఆలోచించుకోవాలని జగన్ సూచించారు. కానీ ఆ పదవిలో సీనియర్ నేత ఉంటే బాగుంటుందని చెప్పా. దీంతో నా ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ వెంటే ఉన్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగే పనిచేశానని.. రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉందని అన్నారు. పదవుల కోసం కాదు.. పార్టీ కోసమే పనిచేస్తానని తెలిపారు.
వైఎస్ జగన్ తనకు దేవుడులాంటి వాడని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎప్పుడూ తాను ముందుంటానని పేర్కొన్నారు.