Tirumala | తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ విక్రయించడం ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన జకియా.. తాను టీడీపీలోకి చేరుతున్నానని తెలిసి వైసీపీ నేతలు తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు. అయితే ఈ వార్తలను వైసీపీ సీనియర్ నాయకులు బొత్స ఖండించారు. జకియా ఖానమ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఇప్పుడు వైసీపీలో లేరని బొత్స సత్యనారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో ఆమె మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారని చెప్పారు. తిరుమలలో వీఐపీ టికెట్లు ఆమె అమ్ముకున్నట్లు వచ్చిన ఆరోపణలతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.
బెంగళూరుకు చెందిన సాయికుమార్ అనే వ్యక్తికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధిక ధరకు విక్రయించారు. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫారసు లేఖపై అతనికి ఆరు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అమ్మారు. అయితే ఈ టికెట్ల కోసం రూ.65వేలు తీసుకున్నారు. దీనిపైనే సాయికుమార్ అనే వ్యక్తి టీటీడీ అధికారులకు ఫిర్యదు చేశాడు. విచారణలో బ్లాక్‌లో వీఐపీ టికెట్లు విక్రయించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏ1గా జకియా పీఏ చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను చేర్చారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్‌లో విక్రయించారని తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీ చేరబోతున్నాని తెలుసుకుని వైసీపీ నేతలు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తన లెటర్‌ను దుర్వినియోగం చేశారని అన్నారు. తన లెటర్‌ను డబ్బులకు ఇచ్చిన విషయం తెలియదని అన్నారు. పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే ఈ విషయం తనకు తెలిసిందని తెలిపారు. నిజాయితీగా ఉండేవారికి వైసీపీలో గౌరవం లేదని ఆరోపించారు.