AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాదం విశిష్టతను ఏపీ సీఎం చంద్రబాబు అపవిత్రం చేసినందుకు గానూ ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వేడుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు ఈ పూజలు నిర్వహించారు. విజయవాడలో దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని పూజలు చేశారు. తిరువూరులో స్వామిదాస్, కడపలో రవీంద్రనాథ్ పూజలో పాల్గొన్నారు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కళావతి ప్రత్యేక పూజలు జరిపించారు.
.@ncbn కి మంచి బుద్ధి ప్రసాదించమని వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పూజలు
శ్రీవారి లడ్డు విషయంలో అబద్ధపు ప్రచారంతో మహాపచారం చేసిన చంద్రబాబు
చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాజీ… pic.twitter.com/Iw8MdSBijp
— YSR Congress Party (@YSRCParty) September 28, 2024
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఆ పాపంప్రజలకు తగలకూడదనే పూజలు చేశామని చెప్పారు. నెయ్యి కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని మోదుగల డిమాండ్ చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగారని.. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని దేవినేని అవినాశ్ విమర్శించారు. చంద్రబాబుతో ఏపీ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు.
కూటమి కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వంద రోజుల పాలనలో ఏం చేయలేకపోయారని విమర్శించారు.
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఈ పాపానికి ప్రక్షాళనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని ఇటీవల వైసీపీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని వైఎస్ జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ తిరుమలకు రావాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని రాద్ధాంతం చేయడంతో చివరి నిమిషంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.