Tirupati | తిరుపతి మున్సిపల్ ఎన్నిక వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ కోసం వైసీపీ కార్యకర్తలు ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చిత్తూరు భాస్కర్ హోటల్లోఉన్న వైసీపీ మహిళా కార్పొరేటర్లపై జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్ దాడికి యత్నించారు. కార్పొరేటర్లను కాపాడేందుకు వెళ్లిన తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డిపై కూడా కూటమి నేతలు దాడికి యత్నించారు. ఇదిలా ఉండగా.. కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే టీడీపీ దౌర్జన్యాలపై వైసీపీ నేతలు సీరియస్గా స్పందించారు.
మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కూటమి నేతల అరాచకాలపై ఎన్నికల కమిషన్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు వినతిపత్రం అందజేశారు. తిరుపతి, హిందూపురం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేట్లపై కూటమి నేతలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు కూడా చోద్యం చూసినట్లుగా ఉండిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తిరుపతిలో టీడీపీ నేతలు వైసీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రజాప్రతినిదులపై కిరాయి గూండాలతో దాడులు చేయించారని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. ఎన్నికల్లో అశాంతిని సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించినప్పటికీ ఎన్నికల హింసను అరికట్టలేకపోయరని ఆరోపించారు.
Ycp