హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగా ణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్సీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు..మహా అయితే 4 కేసులు పెట్టగలుగుతారు.. ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరంలేదని చెప్పారు. గడిచిన ఐదేండ్లలో 99 శాతం వాగ్ధానాలు అమలు చేశామని తెలిపారు. సినిమాలో ఫస్ట్ ఆఫ్ మాత్రమే అయిందని, కళ్లు మూసుకుంటే 2029 ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పారు. ఇంటింటికీ మనం చేసిన మంచి బతికే ఉందని. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.