Vijayasai Reddy | రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్లడం వల్ల జగన్‌కు, పార్టీ తీవ్ర నష్టం జరిగినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ఆయన తెలిపారు. తనలాంటి వాళ్లు వెయ్యి మంది వెళ్లినా జగన్‌కు ఆదరణ తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తాను రాజీనామా చేయడానికి ముందు జగన్‌తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. దైవ భక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను.. అందుకే తప్పుకుంటున్నానని వివరించారు. విజయసాయి రెడ్డి ప్రాతినిథ్యాన్ని ఎవరూ తగ్గించలేరని అన్నారు.
పదవికి రాజీనామా చేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని విజయసాయి రెడ్డి అన్నారు. సీటు కూటమికి వస్తుందని తెలిసే తెలిసే రాజీనామా చేశానని తెలిపారు. నాకంటే గొప్పగా ఆలోచించే వ్యక్తులకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. తనపై 22 కేసులు ఉన్నాయని.. ఎప్పుడూ భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టంచేశారు. 2014లో తనను అప్రూవర్‌గా మారాలని ఎంతో బలవంతపెట్టారని.. అయినప్పటికీ నిరాకరించానని తెలిపారు. అప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పారు. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మకద్రోహం, మోసం చేయడం తనకు తెలియదని స్పష్టం చేశారు.
వైసీపీ కోసం 2014 నుంచి సర్వశక్తులూ వినియోగించానని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశానని పేర్కొన్నారు. తాను వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఇంకా ఉన్నారని.. భవిష్యత్తులో వస్తారని తెలిపారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పనని ఆయన అన్నారు. అబద్ధాలు చెబితే దేవుడు శిక్షిస్తాడని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు తిరుమలకు వస్తే ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు.
కేసులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇంకా బలహీనుడిని అవుతానని చెప్పారు. అలాంటప్పుడు కేసులు ఎందుకు మాఫీ చేస్తారని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు వేరని అన్నారు. రాజ్యసభ ఎంపీగా అటు రాష్ట్రానికి, ఇటు పార్టీకి న్యాయం చేయలేనని వ్యాఖ్యానించారు. రాజీనామాలో ఎవరి ఒత్తిడి లేదని.. ఎవరికీ భయపడే తత్వం తనది కాదని స్పష్టం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డికి గుండెపోటు అని ఎందుకు అబద్ధం చెప్పారని మీడియా అడిగిన ప్రశ్నకు కూడా విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు. వైఎస్ వివేకానంద చనిపోయినట్లు ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు. ఆ విషయం తెలియగానే తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వెంటనే పులివెందులలో ఉన్న అవినాశ్ రెడ్డికి ఫోన్ చేస్తే గుండెపోటు అని చెప్పారని అన్నారు. తనకు ఫోన్లో చెప్పిన విషయాన్నే మీడియా ముందు చెప్పానని వివరించారు.